Nirmala Sitharaman: ఆర్థిక బిల్లు అంటే ఏమిటీ..ఎలా ఆమోదం పొందుతుంది..! 6 d ago

కేంద్రప్రభుత్వం ప్రతిపాదించిన 35 సవరణలతో ఆర్థిక బిల్లు 2025 ను మార్చి 25న లోక్సభ ఆమోదించింది. ఈ బిల్లును రాజ్యసభ పరిశీలించి, ఆమోదించిన తర్వాత 2025-26 బడ్జెట్ ప్రక్రియ పూర్తయినట్లు అవుతుంది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి ప్రతిపాదిత బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వ మద్దతు ఉన్న పథకాలకు రూ.5,41,850.21 కోట్లు కేటాయించగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఈ మొత్తం రూ.4,15,356.25 కోట్లుగా ఉంది. ఇది కాకుండా, ఈ ఆర్థిక సంవత్సరం 2026లో ఆర్థిక లోటు 4.4 శాతంగా ఉంటుందని అంచనా వేయగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇది 4.4 శాతంగా ఉంది. రాబోయే ఆర్థిక సంవత్సరానికి స్థూల దేశీయోత్పత్తి రూ.3,56,97,923 కోట్లు, ఇది ప్రస్తుత ఆర్థిక సంవత్సరం కంటే 10 శాతం ఎక్కువ.
ఆర్థిక బిల్లు అంటే..
కొత్త పన్నులను, ఉన్న పన్నుల విధానంలో మార్పులను ప్రభుత్వం ఆర్థిక బిల్లులో ప్రతిపాదిస్తుంది. బడ్జెట్ సమర్పించిన వెంటనే లోక్ సభలో దీనిని ప్రవేశ పెడతారు. ఆర్థికాంశాలతో కూడిన బిల్లును ఆర్థిక బిల్లు అంటారు. ఈ బిల్లులు మూడు రకాలు. అవి: ద్రవ్య బిల్లు(MONEY BILLS): ఆర్టికల్ 110; ఆర్థిక బిల్లు-1(FINANCIAL BILL-I): ఆర్టికల్ 117 (1); ఆర్థిక బిల్లు-2(FINANCIAL BILLS-II): ఆర్టికల్ 117 (3) ద్రవ్య బిల్లు ఆర్థిక బిల్లులో అంతర్భాగమే. ద్రవ్య బిల్లులన్నీ ఆర్థిక బిల్లులే, కానీ ఆర్థిక బిల్లులన్నీ ద్రవ్య బిల్లులు కాదు.
ద్రవ్య బిల్లు గురించి భారతరాజ్యాంగంలోని ఆర్టికల్ 110 చెప్తుంది. రాష్ట్రపతి పూర్వానుమతితో ముందుగా లోక్సభలో మాత్రమే ప్రవేశ పెట్టాలి. ద్రవ్య బిల్లుపై రాజ్యసభ చర్చించవచ్చు. కొన్ని సిఫార్సులు చేయవచ్చు. ఎలాంటి అభ్యంతరం లేకుండా ఆమోదించవచ్చు. 'ద్రవ్య బిల్లు'ను తిరస్కరించే అధికారం లేదా సవరించే అధికారం రాజ్యసభకు లేదు. ద్రవ్య బిల్లుపై రాజ్యసభ 14 రోజుల్లోగా నిర్ణయాన్ని వెల్లడించాలి. లేకపోతే బిల్లును ఆమోదించినట్లుగానే పరిగణించి, రాష్ట్రపతి ఆమోద ముద్ర కోసం పంపుతారు. ఆర్టికల్ 110(1) ప్రకారం పన్నుల విధింపు, రద్దు, తగ్గింపు, మార్పు చేయడం, క్రమబద్ధీకరించడం మొదలైన అంశాల్లో ఏ ఒక్క అంశం ఉన్నా దాన్ని 'ద్రవ్య బిల్లు'గా పేర్కొంటారు.
ఆర్టికల్ 110(2) ప్రకారం జరిమానాలు, లైసెన్స్ ఫీజులు, స్థానిక స్వపరిపాలనా సంస్థలు విధించే సుంకాలు ఉన్నంత మాత్రాన దాన్ని ద్రవ్యబిల్లుగా పరిగణించరు. ఆర్టికల్ 10(3) ప్రకారం ఒక బిల్లు ద్రవ్య బిల్లా? కాదా? అనే ప్రశ్న వచ్చినప్పుడు లోక్సభ స్పీకర్ తుది నిర్ణయం ప్రకటిస్తారు. ఆ అధికారం స్పీకర్కే ఉంటుంది. ఆ నిర్ణయాన్ని న్యాయస్థానాల్లో లేదా పార్లమెంటులో సవాలు చేయడానికి వీల్లేదు. రాష్ట్రపతి కూడా దీనిపై ప్రశ్నించకూడదు. ప్రతి ద్రవ్య సంబంధ బిల్లుని ప్రభుత్వ బిల్లుగా పరిగణిస్తారు. దీనిని మంత్రివర్గ సభ్యుడు మాత్రమే సభలో ప్రవేశపెట్టాలి. ఆర్టికల్ 110(4)ను అనుసరించి ద్రవ్య బిల్లును ఆర్టికల్ 109 ప్రకారం రాజ్యసభకు పంపేటప్పుడు, ఆర్టికల్ 111 ప్రకారం రాష్ట్రపతి ఆమోదానికి పంపేటప్పుడు సంబంధిత బిల్లును ద్రవ్య బిల్లుగా లోక్ సభ స్పీకర్ ధ్రువీకరించాలి.
రాజ్యాంగంలోని ఆర్టికల్ 117 ఆర్థిక బిల్లుల గురించి వివరిస్తుంది. ప్రభుత్వ ఆదాయం, వ్యయానికి సంబంధించిన ప్రస్తావన ఉన్న బిల్లులను 'ఆర్థిక బిల్లులు' అంటారు. వీటిని 2 రకాలుగా వర్గీకరించవచ్చు. మొదటి తరగతి ఆర్థిక బిల్లు (ఆర్టికల్ 117 (1))లో కేంద్ర ప్రభుత్వం రుణాలను సేకరించే నియమ నిబంధనలు ఉంటాయి. దీనిని రాష్ట్రపతి పూర్వానుమతితో లోక్సభలో ప్రవేశ పెట్టాలి. ఇది లోక్సభలో ఆమోదం పొంది, రాజ్యసభలో ఓటింగ్కు వచ్చినప్పుడు సాధారణ బిల్లుగానే పరిగణించి, రాజ్యసభ కూడా లోక్సభతో సమానంగా అధికారాలను కలిగి ఉంటుంది. బిల్లును సవరించే ప్రక్రియను రాజ్యసభ సూచించవచ్చు లేదా బిల్లును తిరస్కరించవచ్చు. ఆమోదించే క్రమంలో ఉభయ సభల మధ్య అంగీకారం కుదరకపోతే రాష్ట్రపతి ఉభయ సభల సంయుక్త సమావేశం ఏర్పాటు చేస్తారు.
రెండో తరగతి ఆర్థిక బిల్లు (ఆర్టికల్ 117 (3)) లో కేంద్ర సంఘటిత నిధి నుంచి ఖర్చు చేసే అంశాలు ఉంటాయి. ఆర్టికల్ 110లో పేర్కొన్న అంశాలు ఉండవు. ఈ బిల్లును సాధారణ బిల్లుగానే పరిగణించవచ్చు. పార్లమెంటు ఉభయ సభల్లో ఎక్కడైనా ప్రవేశపెట్టవచ్చు. ఈ తరహా బిల్లును రాజ్యసభ ఆమోదించవచ్చు లేదా తిరస్కరించవచ్చు. ఆమోదించే క్రమంలో ఉభయ సభల మధ్య అభిప్రాయ భేదాలు వస్తే రాష్ట్రపతి ఉభయ సభల సంయుక్త సమావేశాన్ని ఏర్పాటు చేస్తారు. ద్రవ్య బిల్లులను, మొదటి తరగతి ఆర్థిక బిల్లులను కేవలం రాష్ట్రపతి సిఫార్సుతో మాత్రమే లోక్ సభలో ప్రవేశపెట్టాలి. రెండో తరగతి ఆర్థిక బిల్లులను, సాధారణ బిల్లులను రాష్ట్రపతి ముందస్తు అనుమతితో సంబంధం లేకుండానే పార్లమెంటు ఉభయ సభల్లో ఎందులో అయినా ప్రవేశపెట్టవచ్చు.